Wednesday, 5 March 2014

చైతన్య జ్యోతులారా!


 - సుల్తానా

చైతన్య జ్యోతులారా - నవ జీవన స్రవంతులారా!
శీలవతులారా - కోమల మనస్కులారా
సత్యవతులారా - త్యాగమయిలారా
అబలలు కాదు సబలలు మీరమ్మా!!
మీ పాదాల చెంత స్వర్గముందమ్మా!!!

సహనానికి మీరే మాతృకలు - శాంతానికి మీరే ఏలికలు
స్నేహానికి మీరే వల్లికలు - మమతలకు మీరే మల్లికలు
ఆప్యాయతను పెంచే అమ్మలు మీరమ్మా...
తత్వవేత్తల ఉనికికి తల్లులు మీరమ్మా....
ప్రవక్తలు పెరిగింది మీ ఒడిలోనేయమ్మా...

సౌమ్యానికి మీరే సుమలతలు - సాత్వికత పంచే సహన శీలులు
వినయానికి మీరే పొందికలు - విధేయతకు మీరే తారకలు
సత్యాత్ముల్ని సాకిన సాహస వనితలు మీరమ్మా!
దురాత్ముల్ని చెండాడిన వీర మాతలు మీరమ్మా!!

ఇంటికి మీరే దీపాలు - ప్రేమకు మీరే ప్రతిరూపాలు
సమరానికి మీరే  ప్రేరకులు - విజయానికి మీరే కారకులు
ఆసియా సయ్యిదా సోదరిలోయమ్మా...
మర్యం సయ్యిదా వారసులోయమ్మా...
ఖదీజా తాహిరా కూతురులోయమ్మా...
ఆయిషా సిద్దీఖాకు శిష్యులోయమ్మా...
ఫాతిమా సయ్యిదాకు ప్రియ సఖులోయమ్మా...
ఖుర్‌ఆన్‌ చదువుతూ కదలాలోయమ్మా...
ధర్మ తేజమై వెలగాలోయమ్మా!
                                       

Saturday, 8 February 2014

మహిళా హక్కులు మరియు ఇస్లాం



పాశ్చాత్య ప్రపంచం ప్రకృతిపై తిరుగుబాటు చేసి సామాజిక వ్యవ స్థను ఛిన్నాభిన్నం చేసింది. ఫలితంగా కుటుంబ వ్యవస్థ అంతరించి పోతోంది. వ్యక్తికి తన వంశం ఏదో తెలియయని దౌర్భాగ్య స్థితి. ఈ వికృత పోకడ అందరికంటే అధికంగా అబలను అవమానం పాలు చేసింది. ఆమె బ్రతుకు తెరువు కోసం బయట వెళ్ళాల్సిన గత్యంత రానికి కారణం అయింది. తాను బైట పని, ఇంటి పని, వంట పని, భర్త ఒంటి పని కూడా చేయాలి. వాణిజ్య ప్రకటనల్లో తానే అంగడి బొమ్మనవ్వాలి. సిగ్గు, సిరిని వదిలేసి, మానం మర్యాదను తగలేసి వీరు చేసే ఈ వర్తకం పూర్తి మానవతకే కళంకం. పూర్వపరాల్లోకెళితే -

హిందూ మతంలో స్త్రీ

స్త్రీలకు తండ్రి ద్వారాగానీ, భర్త ద్వారాగానీ ఆస్తిలో హక్కు ఉండేది కాదు. జీవన వ్యవహారాల్లో స్త్రీ పరుషులు రెండు వ్యక్తిత్వాలుగా గుర్తించ బడేవారు కాదు. పురుషుడు యజమానిగాను, స్త్రీ అతని ఆస్తి గానూ పరగణించబడేది. ఈ కారణంగా భర్త నుండి విడాకులు పొంద డంగాని, వేరే వివాహం చేసుకోవడానికిగాని అనుమతి ఉండేది కాదు. ఒకవేళ భర్త మరణిస్తే పతితోపాటు సతిని కూడా చితిపై పేర్చి నిర్ధాక్షి ణ్యంగా కాల్చేసేవారు. ఒకవేళ ప్రాణాలు మిగిలినా వితంతువుగా మిగి లిపోయిన వనితామణులకు పునర్వివాహ అనుమతి అస్సలుండేది కాదు.ఇది సరిపోదన్నట్లు ‘నియోగం’అన్న ఆచారంతో ఆమెను మరింత కించపర్చడం జరిగేది. ‘నియోగం’ అంటే స్వామి దయానంద సరస్వతి గారు సత్యార్థ ప్రాకాశికలో వివరించినట్లు – వితంతువు మహిళ తన మరిదితోగానీ, మరొక అపరిచిత పురుషునితోగాని వివాహం లేకుండా శారీరక సంబంధం కలిగి ఉండటం. అలాగే భర్త బ్రతికున్న స్త్రీలు కూడా అతని అనుమతితో సంతాన ప్రాప్తి కోసం పరపురుషునితో జత కట్టవచ్చు. ఇదిలా ఉంటే, నేటి హిందూ వివాహ చట్టాన్ని రూపొందిం చడంలో చాలా వరకు ఇస్లాంలోని సామాజిక చట్టాల ద్వారా ప్రయోజ నం పొందడం జరిగిందని డిస్కవరీ ఆఫ్‌ ఇండియాలో స్వయంగా నెహ్రూ గారే పేర్కొనడం గమనార్హం.

యూద మతంలో స్త్రీ

స్త్రీలు అత్యధికంగా అపరిశుభ్రంగా ఉంటారని యూదులు భావించ డమే కాక, బహిష్టు దినాల్లో వారిని అన్నింటికీ ఎడంగా ఉంచేవారు. అలాగే కుమారుడు లేని పక్షంలో మాత్రమే కూతురికి ఆస్తిలో హక్కుం టుంది. కూతుళ్లల్లో కూడా తర్వాతి వారికంటే మొదటి వారికే నాలుగు భాగాలంత వాటా ఉంటుంది. అదే విధంగా విడాకుల విషయాన్ని ప్రస్తావిస్తూ బైబిల్‌ ఇలా అంటోంది: ”స్త్రీ తరఫు నుండి అభ్యంతరం లేకపోతే విడాకుల పత్రం వ్రాసి ఆమె ఇచ్చి ఆమె తన ఇంటి నుండి బహిష్కరించాలి”.

క్రైస్తవ మతంలో స్త్రీ

క్రైస్తవులు తౌరాత్‌ ధర్మ శాస్రానికే ప్రాధాన్యతనిస్తారు. అయితే క్రైస్తవంలో స్త్రీ యూదత్వంలోకంటే ఎక్కువగా అవమానించబడింది. ‘ఆది మానవుడు ఆదం (అ) స్త్రీయే ఆయన్ను మోస పుచ్చింది’ అని క్రైస్తవం సూచిస్తుంది. క్రైస్తవంలోని పాపం-పరిహారం అన్న విశ్వాసాని కి ఈ భావనే పునాది. అలాగే సెంట్‌ పౌలు ‘పురుషుడు స్త్రీని తాకక పోవడమే మేలు’ అన్న ప్రతిపాదననుసరించి క్రైస్తవ సమాజంలో ఒక సుదీర్ఘ కాలం వరకు సన్యాసత్వం అట్టహాసంగా అమలయింది. అప్ప ట్లో ఆడపడచు మానవ సమాజమ పాలిట వినాశకారిణిగా పరిగణించ బడేది. చివరి ఆమె రక్తం పంచుకు పుట్టిన పురుష పుంగవులు సయి తం ఆమెను ద్వేషించే దుస్థితి. అలాగే విడాకులు, పునర్వివాహ హక్కు స్త్రీకి ఉండేది కాదు.

ఈరాన్‌లో స్త్రీ

ఈరాన్‌ స్త్రీల విషయంలో విచిత్ర వాదానికి దిగింది. ‘మజ్‌దక్‌’ అన బడే వ్యక్తి ప్రతిపాదన మేరకు – స్త్రీలు పురుషుల ఉమ్మడి సొత్తు. తత్ఫ లితంగా వారిని ఆస్తిని పంచుకున్నట్లు పంచుకునేవారు. ఈ వికృతా చారం ఎంతగా ప్రబలిందంటే వావివరసులనేవి పూర్తి తుడిచి పెట్టుకు పోయాయి. ఈ పొకడకు వ్యతిరేకంగా మరొక సిద్ధాంతి ‘మాని’ పేరుతో ఒకఉద్యమం లేవదీశాడు.ఇది మరో అనర్థానికి దారి తీసింది. అతడు భార్యాభర్తల సంబంధాన్ని కూడా అధర్మమని ఖరారు చేశాడు. ఈ రెండు అతివాదాల నడుమ నలిగింది మాత్రం అతివలే.

రోము, గ్రీకు సమాజంలో స్త్రీ

గ్రీకులలో అడపడచులు అంగడి వస్తువులా అమ్మబడేవారు. నేటి కట్నం అనే రాక్షస ఆచారం కూడా వారినుండి సంక్రమించినదే.చట్టం రీత్యా ఒకే భార్య కలిగి ఉండే అనుమతి ఉండేది. కాని చట్ట విరుద్ధమ యిన అక్రమ సంబంధాలకు ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు. ప్రొఫె సర్‌ ‘లీకి’ ప్రకారం-గ్రీకులో అశ్లీలత, నీతి బాహ్యత విడాకులు ఎంత గా ప్రబలాయంటే వేశ్యల వద్దకు వెళ్లడం వినా జాతి నాయకుల వంటి వారికి సయితం మార్గాంతరం ఉండేది కాదు. గ్రీకు సంస్కృతి నుండే రోము సంస్కృతి పుట్టుకు వచ్చింది. తత్కారణంగా ఇవే దురాచారాలు వారిలోనూ ఉండేవి.

అరేబియాలో స్త్రీ

ఏ భూభాగం నుండయితే ఇస్లాం కాంతి ప్రసరించిందో అక్కడ కూడా ఆడపిల్లల స్థితి చాలా దారుణంగా ఉండేది. ఆడ శిశువు పడితే సజీ వంగా పాతి పెట్టేవారు. ఆస్తిలో స్త్రీకి ఎలాంటి వాటా ఉండేది కాదు. సవతి తల్లుల్ని వివాహమాడే దురాచారం ఉండేది. వితంవుల విషయం లో న్యాయసమ్మతమయిన చట్టంఉండేది కాదు.భారత దేశంలో పాండ వుల మాదిరిగానే ఏక సమయంలో ఒక స్త్రీకి నలుగురేసి భర్తలుండే వారు.
ఈ వివాహాన్ని ‘రహత్‌’ వివాహంగా పిలిచేవారు. ‘రవికల పండుగ’ మాదిరి భార్యలను మార్చుకునే నికృష్ట ఆచారం కూడా ఉండేది.
విటన్నింటికీ భిన్నంగా ఇస్లాం ప్రసాదించిన సామాజిక చట్టం అతివల ఆత్మ గౌరవానికి, మహిళల మానం, మర్యాదలకు పెద్ద పీట వేసింది. ఇస్లాం స్త్రీకి ప్రసాదించిన సామాజిక స్థాయిని సంక్షిప్తంగా ఇక్కడ పొందు పరుస్తున్నాము.

ఇస్లాం ధర్మంలో స్త్రీ

మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) వారు ప్రభవించిన సమయానికి నిస్స హాయులు, అణగారిన రెండు వర్గాలు ఉండేవి. ఒకటి స్త్రీల వర్గం, రెండవది బాలిసల వర్గం. మహనీయ ముహమ్మద్‌ (స) అన్ని వర్గాల ప్రజలతోపాటు ముఖ్యంగా ఈ ఇరు వర్గాల పట్ల మరింత కారుణ్యం తో వ్యవహరించారు. ఇస్లాం స్త్రీలకు గౌరవాన్నిచ్చింది అనడానికి నిద ర్శనం ఖుర్‌ఆన్‌లో 176 వాక్యాలు గల ఒక పూర్తి సూరా (అధ్యాయం) స్త్రీల కోసమే అవతరించింది. ఆ సూరా పేరు ‘అన్నిసా- స్త్రీలు’. ఖుర్‌ ఆన్‌లోని మరో సూరాకు పుణ్యస్త్రీ పేరయిన ‘మర్యం’అని పెట్టబడింది. అలాగే అల్లాహ్‌ా విశ్వాసుల కోసం ఆదర్శంగా తోటి విశ్వాసుల్ని పేర్కొ ంటూ ఇద్దరు స్త్రీలను-ప్రవక్త ఈసా (అ) గారి మాతృమూర్తి హజ్రత్‌ మర్యమ్‌ మరియు నియంత ఫిర్‌ఔన్‌ సతీమణి హజ్రత్‌ ఆసియా బిన్త్‌ ముజాహిమ్‌ (అ)ల పేర్లను ప్రస్తావించాడు అంటే అల్లాహ్‌ా స్త్రీలకు ఏ స్థాయి గౌరవాన్ని ఇచ్చాడో ఇట్టే అర్థమవుతుంది. వివరాల్లోకెళితే -

సమానత్వంకన్నా న్యాయమే ప్రాధానం

ఇస్లాం స్త్రీపరుషుల మధ్య సమానత్వం, సమాన స్థాయి గురించి ఆదే శించిందని సాధారణంగా కొందరు అంటుంటారు. ఇది నిజం కాదు. ఇస్లాం ఇద్దరి మధ్య న్యాయం గురించి ఆజ్ఞాపించింది. న్యాయం అంద రికి వారి ప్రతిభాపాటవాలను పరిగణలోకి తీసుకోకుండా సమాన స్థాయిని కల్పించడం కాదు. అర్హతను బట్టి తగిన స్థానాన్ని ఇవ్వడం. స్త్రీ పురుషుల సామర్థ్యాలలో ప్రకృతి రీత్యా వ్యత్యాసం ఉంది. ఈ తేడా ను గమనించకుండా ఇద్దరిపై ఒకే విధమయినటువంటి బాధ్యతలను మోపడం ఎంత మాత్రం న్యాయం అన్పించుకోదు. అందరికీ అన్నీ ఇచ్చేయడం కాదు, ముందు వారి సామర్థ్యాలను చూడాలి. పురుషులు, స్త్రీలు, పిల్లలు,పెద్దలు,యువకులు, వృద్ధులు, పండితులు, పామరులు, ధనవంతులు, పేదవారు-అందరిపై ఒకే విధమయినటువంటి బాధ్యత ల్ని మోపడం ఏ విధంగానూ వివేకం అన్పించుకోదు. కాబట్టి బాహ్య ప్రపంచానికి అనుకూలంగా పురుషుడి సృజన జరిగింది గనక ఇస్లాం బైటి వ్యవహారాలు పురుషునికి అప్పగించి, ఇంటి వ్యవహారాలు స్త్రీకి అప్పగిస్తోంది. దీనర్థం ఒకరి స్థాయి ఎక్కువ, మరొకరి స్థాయి తక్కువ అని ఎంత మాత్రం కాదు.

స్త్రీ, పురుషునిలో ఒకే ఆత్మ

పురుషులకంటే తక్కువ స్థాయి గల సృష్టిరాసిగా స్త్రీని భావించడాన్ని ఖుర్‌ఆన్‌ ఖండిస్తోంది: ”మానవులారా! మీ రపభువుకు భయ పడండి. ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. ఆదే ప్రాణి నుండి దాని జతను సృష్టించాడు”. (దివ్యఖుర్‌ఆన్‌-4:1)

స్తీ శాశ్వత వ్యక్తిత్వం గలది

స్త్రీని శాశ్వతమయిన  వ్యక్తిత్వం గలది ఇస్లాం పేర్కొంటుంది. ”మంచి పనులు చేసేవారు-పరుషులయినా, స్త్రీలయినా వారు విశ్వాసులయిన పక్షంలో స్వర్గంలో ప్రవేశిస్తారు”. (దివ్యఖుర్‌ఆన్‌-4: 125)

యాజమాన్యపు హక్కు:

ఆమెకు షరీయతు సరిహద్దుల్లో ఉంటూ వ్యాపారం, ఉద్యోగం చేసు కునే అనుమతి ఉంది. తన సొమ్మును ధర్మం ఆమోదించిన ఏ విష యంలోనయినా ఖర్చు చెసుకునే హక్కు ఆమెకుంది. ఆమె భర్త అయినా సరే ఆమె అనుమతి లేనిదే ఆమె ఆస్తిని ముట్టుకునే అధి కారం, హక్కు అతనికి లేదు.
”ఒకవేళ స్త్రీలు సంతోషంతో తన మహర్‌ సొమ్ము నుండి కొంత భాగం ఇచ్చినట్లయితే దానిని మీరు ఖర్చు పెట్టుకోవడం ధర్మసమ్మ తమే”. (దివ్యఖుర్‌ఆన్‌-4: 4)

విమర్శించే హక్కు:

పురుషుల వలే స్త్రీలకు సయితం ఇంటి వ్యవ హారాల్లో కాక, సామాజిక, ధార్మిక వ్యవహారాల్లోనూ విమర్శించే హక్కు ఉంది. కొన్ని విషయాలలో హజ్రత్‌ అలీ (ర) గారితో విశ్వా సుల మాత అయిన ఆయిషా (ర)గారు విభేదించడం, స్వయంగా అప్పటి ఖలీఫా అయిన హజ్రత్‌ ఉమర్‌ (ర) గారిని ఓ సాధారణ మహిళ ‘మహర్‌’ విషయమయి నిలదీయడం, ఆయన కూడా తన అభిప్రాయాన్ని విరమించుకుని ‘మదీనాలో ఉమర్‌కంటే తెలిసి వారున్నార’ని అంగీకరించడం వంటి సంఘటనలు దీనికి మచ్చు తునకలు.

నికాహ్‌ హక్కు:

ఇస్లాం పరిపూర్ణమవ్వక ముందు ఏ సమాజం లోనూ వివాహం కోసం అమ్మాయి అనుమతి ఆచారం ఉన్నట్లు కన బడదు. ”అవివాహిత వనితలతో వారి వివాహం గురించి అభిప్రా యం కోరాలి” అని, ”కన్నె పిల్లలతో వివాహం కోసం వారి అను మతి కోరాలి”అని దైవప్రవక్త ముహమ్మద్‌ (స)వారు నొక్కి వక్కాణిం చడమే కాక, ‘తన తండ్రి తన అభీష్టానికి వ్యతిరేకంగా వివాహం జరిపించాడు’ అని ఓ అమ్మాయి దావా వేయగా, ప్రవక్త (స) ఆ పెళ్ళిని రద్దు చేయించారు. ”ఇస్లాంలో వివాహానికి ముందు అమ్మా యితో తప్పనిసరి అనుమతి పొందే విధానం నాకు ఎంతో నచ్చి ంది” అని ఓ సందర్భంలో భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పాయి అభిప్రాయ పడటం గమనార్హం!

స్త్రీలకు భద్రతా హక్కు:

ఇస్లాంలో ఒక ప్రధాన చట్టం ‘అమాన్‌’ చట్టం. అమాన్‌ అంటే రక్షణ కల్పించడం. ఈ హక్కును ఇస్లాం పురుషుల వలే స్త్రీలకు సయితం ఇచ్చింది. ఈ హక్కు గల వారు ఇతరులను రక్షణ కల్పించవచ్చు. అలా రక్షణ పొందిన వ్యక్తి మీద దాడికి దిగడానికి అనుమతి ఉండదు.”మీరు ఎవరికి రక్షణ కల్పిం చారో నేను కూడా వారికి రక్షణ ఇచ్చాను” అని ప్రవక్త (స) మక్కా విజయం సందర్భంగా హజ్రత్‌ ఉమ్మె హానీ(ర)గారితో అనడం దీనికి ప్రబల నిదర్శనం. ఇలా చెప్పుకుంటూపోతే, విద్యా హక్కు, ఫత్వా హక్కు, ఉద్యోగ హక్కు, ఆస్తి హక్కు, ఖులా హక్కు మొదలయిన ప్రధాన హక్కులన్నింటిని ఇస్లాం మహిళకు ప్రసాదించింది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఇస్లాం పడతి ప్రగతికి సోపానం. దీనికంటే శ్రేయస్కరమయిన వ్యవస్థ మరొకటి లేదు. లభించదు. ఇందులో వారికి గౌరమూ ఉంది. రక్షణా ఉంది.

పరదా పరిచయం


ఖుర్ఆన్లో పరదా పురుషులు మరియు స్త్రీలకు అనివార్యం చేయబడింది. ఇస్లాంలో ఇది ముందుగా పురుషులకు, ఆ తర్వాత స్త్రీలకు వర్తిస్తుంది. ఖుర్ఆన్ మరియు హదీసులలో సూచించిన విధంగా కేవలం ఒక్క అల్లాహ్ నే ప్రార్దిoచడం తన కర్తవ్యo మరియు అల్లాహ్ యే తాను సృష్టించబడటానికి కారణం అని ప్రతి ముస్లిం భావిస్తాడు. పరదా కూడా అల్లాహ్ కు విధేయత చూపే ఓ మార్గం.
“(చూడండి) అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త ఏ వ్యవహారంలోనైనా ఒక నిర్ణయం చేసిన తరువాత విశ్వాసులైన ఏ పురుషునికిగానీ, స్త్రీకి గానీతమకు వర్తించే ఆ వ్యవహారంలో ఎలాంటి స్వయం నిర్ణయాధికారం మిగిలి ఉండదు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు అవిధేయత చూపితే అతను స్పష్టమైన అపమార్గానికి లోనైనట్లే (జాగ్రత్త). ఖుర్ఆన్ సూరా అహజాబ్ 33:36
ఖుర్ఆన్ మహిళలకు పరదా ఎందుకు విధించిందంటే దాని వల్ల వారు గౌరవం గల స్త్రీలు అని తెలుస్తుంది మరియు స్త్రీల మానమర్యాదలకు హాని కలిగే అవకాశం ఉండదు. వినయం విశ్వాసానికి చిహ్నం. వినయం, విధేయత, పరదా లేని వారు ధర్మానికి కూడా ప్రాధాన్యత ఇవ్వరు. పరదా స్త్రీని కించపరచదు, సరికదా ఆమె మానమర్యాదలను కాపాడుతుంది. పరదా వల్ల స్త్రీలపై గౌరవం పెరుగుతుంది మరియు సమాజంలో శాంతి నెలకొంటుంది.
పురుషుల పరదా
ఖుర్ఆన్ లో అల్లాహ్ సెలవిస్తున్నాడు: (ఓ ప్రవక్తా!) ముస్లిం పురుషులు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, వారు తమ మర్మస్థానాలను కాపాడుకోవాలనీ, అది వారి కొరకు పవిత్రమైనదని వారితో చెప్పు. వారు చేసేదంతా అల్లాహ్ కు తెలుసు. ఖుర్ఆన్ సూరా నూర్ 24:30
గైర్ మహ్రం (పెళ్లి చేసుకొనే అవకాశం గలవారు)తో కరచాలనం చేయడం
ఇస్లాంలో గైర్ మహ్రం తో కరచాలనం చేసే అనుమతి లేదు. దీని గురించి దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “మీకు అనుమతించబడని (గైర్ మహ్రం) స్త్రీలను ముట్టుకోవడం కన్నా మీ తలను ఇనుప సూదితో గుచ్చడం మీకు మేలైనది.” (అల్ ముజాం అల్ కబీర్ లో అత్ తబరాని (20/213), అల్ ముసన్నఫ్ లో అబీ శైబహ్ (4/341)
స్త్రీల పరదా
(ఓ ప్రవక్త ! ముస్లిం స్త్రీలు తమ చూపులను క్రిందికి ఉంచాలనీ, తమ మర్మస్థానాలను రక్షించుకోవాలనీ, బహిర్గితమై ఉండేది తప్ప – తమ అలంకరణను బహిర్గతం చేయరాదనీ, తమ వక్షస్థలాలపై ఓణిలు వేసుకోవాలనీ, తమ భర్త లేక తమ తండ్రి లేక తమ మామగారు లేక తమ కొడుకులు లేక తమ భర్త కొడుకులు లేక తమ సోదరులు లేక తమ సోదరుల కుమారులు లేక తమ అక్కాచెల్లెళ్ళ కొడుకులు లేక తమతో కలసి మెలసి ఉండే స్త్రీలు, లేక తమ బానిసలు లేక ఇతరత్రా ఉద్దేశాలు లేకుండా తమకు లోబడి ఉన్న పురుష సేవకులు లేక స్త్రీల గుప్త విషయాల గురించి ఇంకా తెలియని బాలురు – వీళ్ళ ఎదుట తప్ప ఇతరుల ఎదుట తమ అలంకరణలను (అందచందాలను) కనబడనివ్వకూడదనీ, దాగి ఉన్న తమ అలంకరణ ఇతరులకు తెలిసిపోయేలా తమ కాళ్ళను నేలపై కొడుతూ నడవరాదని వారితో చెప్పు. ముస్లింలారా ! మీరంతా కలసి అల్లాహ్ సన్నిధిలో పశ్చాత్తాపం చెందండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.” (ఖుర్ఆన్ సూరా నూర్ 24:31)
ఓ ప్రవక్తా ! తమపై నుంచి తమ దుప్పట్లను (క్రిందికి) వ్రేలాడేలా కప్పుకోమని నీ భార్యలకు, నీ కుమార్తెలకు, విశ్వాసులైన స్త్రీలకు చెప్పు. తద్వారా వారు చాలా తొందరగా (మర్యాదస్తులుగా) గుర్తించబడి, వేధింపుకు గురికాకుండా ఉంటారు. అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు. (సూరా అహజాబ్ 33:59)
హదీసు
సఫియ్యా బింత్ శైబహ్ రజిఅల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం ఆయిషా రజిఅల్లాహు అన్హా ఇలా అన్నారు: ఈ పదాలు అవతరించినపుడు – “జలాబీబిహిన్న”తో అంతా కప్పుకోండి (అంటే- శరీరం, ముఖం, మెడ, చాతీలపై)” – వారు (ఇజార్) ఒక రకమైన బట్ట తీసుకొని దాన్ని అంచుల నుండి కత్తిరించి తమ ముఖాలను కప్పుకున్నారు. (సహీహ్ బుఖారీ 4481)
పరదా చేసే వయసు
ఆడపిల్లలు యుక్త వయస్సుకు రాగానే పరదా చేయాలి.
(మగపిల్లలు, ఆడపిల్లలు) యుక్తవయసుకు చేరుకున్నారనడానికి మూడు సూచనలు ఉన్నాయి:
1 – తడి కలలు రావడం
2 – మర్మాంగాల చుట్టూ వెంట్రుకలు రావడం
3 – పద్నాలుగు సంవత్సరాలకు చేరడం
ఆడవారిలో నాలుగో సూచన కూడా ఉంది:
4 – బహిష్టు
ఈ నాలుగింటిలో ఏ ఒకటి కనిపించినా అప్పటి నుండి ఆడపిల్ల తప్పనిసరి పరదా చెయ్యాలి మరియు నిషేధించబడిన వాటి నుండి ఆగాలి.
పురుషుల పరదా నిబంధనలు
1. కనీసం నాభి నుండి కాలి మడమకు దిగకుండా ఉండాలి.
2. ఇది శరీరానికి చాలా బిగువుగా లేదా శరీరం కనిపించేలా ఉండకూడదు.
3. అది ఎంత వదులుగా ఉండాలంటే శరీరపు ఏ భాగమూ కనిపించకూడదు.
4. అది మగవారి వస్త్రంలా ఉండాలి, ఆడవారి వస్త్రంలా ఉండకూడదు.
5. దాని మీద ఎలాంటి డిజైన్లు ఉండకూడదు, ఎందుకంటే వాటి వల్ల ఆడవారికి ఆకర్షణ పుడుతుంది.
6. అది గర్వానికి, అహంకారానికి ప్రతీక కాకూడదు.
7. అది అవిశ్వాసులను పోలి ఉండరాదు. అవిశ్వాసుల ధర్మానికి ప్రతిబింబించే ఎలాంటి గుర్తులు ఉండకూడదు.
స్త్రీల పరదా నిబంధనలు
1. పూర్తి శరీరాన్ని తల నుండి కాళ్ళవరకు కప్పి ఉంచాలి
2. ఇది శరీరానికి చాలా బిగువుగా లేదా శరీరం కనిపించేలా ఉండకూడదు.
3. అది ఎంత వదులుగా ఉండాలంటే శరీరపు ఏ భాగమూ కనిపించకూడదు.
4. అది ఆడవారి వస్త్రంలా ఉండాలి, మగవారివిలా ఉండకూడదు.
5. దానికి సువాసనలు పూసుకోరాదు.
6. దాని మీద ఎలాంటి డిజైన్లు ఉండకూడదు, ఎందుకంటే వాటి వల్ల మగవారికి ఆకర్షణ పుడుతుంది.
7. అది గర్వానికి, అహంకారానికి ప్రతీక కాకూడదు.
8. అది అవిశ్వాసులను పోలి ఉండరాదు. అవిశ్వాసుల ధర్మానికి ప్రతిబింబించే ఎలాంటి గుర్తులు ఉండకూడదు.


    ఇస్లాం స్త్రీలను రక్షిస్తుంది. అoదుకొరకే అల్లాహ్ ఇలాంటి కట్టుదిట్టమైన నియమాలను రూపొందించాడు. నేటి సమాజంలో ఆడవారిని చాలామంది మగవారు కేవలం ఆట వస్తువుగా వాడుతున్నారు. ప్రతి ప్రకటనలో స్త్రీలను అర్ధనగ్నంగా చూపిస్తున్నారు. ఇది ఆడవారి స్వేచ్చా? లేదా వారిని కించపరచడమా? ఇస్లాం ఆడవారికి అసలైన స్వేచ్చను 1400సంవత్సరాల క్రితమే ఇచ్చింది.

    ఇస్లాంలో స్త్రీ స్థానం


    మానవ హక్కులు

    ఇస్లాంలో స్త్రీలు కూడా అల్లాహ్ ను ఆరాధించబడే విషయంలో ప్రశ్నించబడతారు. వారు మంచి ప్రవర్తన విషయంలో ఒకరిని ఒకరు మించిపోవడానికి ప్రయత్నించాలి. మానవత్వపరంగా ఇస్లాంలో స్త్రీ పురుషులు సమానులు. ఖుర్ఆన్ లో ఓ సూరా పేరు ‘సూరా నిసా’ అనగా ‘స్త్రీ’ అని ఉంది. అందులో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: “ మానవులారా!   మిమ్మల్ని   ఒకే ప్రాణి నుంచి పుట్టించి,దాన్నుంచే దాని జతను  కూడా సృష్టించి, ఆ ఇద్దరి  ద్వారా ఎంతో మంది   పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి. ఎవరిపేరుతో  మీరు  పరస్పరం  మీకు కావలసిన వాటిని  అడుగుతారో  ఆ  అల్లాహ్‌కు  భయపడండి.  బంధుత్వ సంబంధాల  తెగత్రెంపులకు దూరంగా ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ మీపై నిఘావేసి ఉన్నాడు.” ఖుర్ఆన్ సూరా నిసా 4:1. స్త్రీ అయినా, పురుషుడైనా జన్మించే విధానం ఒకటే కావున వారు మానవతా దృష్ట్యా సమానులు. కొన్ని మతాలు భావించేటట్లు స్త్రీలు దుష్ట శకునం కారు, పురుషులు కూడా పుట్టుకతో చెడ్డవారు కారు. అలాగే ఎవరిపై ఎవరికీ ప్రాధాన్యత లేదు, ఎందుకంటే అది సమానత్వానికి విరుద్ధం అవుతుంది.

     పౌర హక్కులు

    ఇస్లాంలో స్త్రీలకు తమ సొంత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంది. తను తనకు ఇష్టమైన మతాన్ని స్వీకరించవచ్చు. ఖుర్ఆన్ లో ఇలా అనబడింది: “ధర్మం విషయంలో బలవంతం ఏమీ లేదు.  సన్మార్గం అపమార్గం  నుంచి ప్రస్ఫుటమయ్యింది.” (ఖుర్ఆన్ సూరా బఖరా 2:256) ఇస్లాం స్త్రీలను తమ అభిప్రాయాలను, భావనలను పంచుకునే అవకాశం ఇస్తుంది. అనేక సార్లు స్త్రీలు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ను ధర్మం గురించి, అర్థశాస్త్రం గురించి, సామాజిక వ్యవహారాల గురించి ప్రశ్నించేవారు మరియు తమ అభిప్రాయాలను తెలియజేసేవారు అని హదీసుల ద్వారా తెలుస్తుంది. ముస్లిం స్త్రీకి తన భర్తను ఎంచుకునే హక్కు ఉంది. చట్టపరమైన విషయాలలో ముస్లిం స్త్రీ సాక్ష్యం తీసుకోబడుతుంది. వాస్తవికంగా, ఏ విషయాలలో స్త్రీలకు జ్ఞానం ఉందో ఆ విషయాలలో వారి సాక్ష్యానికి విలువ ఇవ్వబడుతుంది.

     సామాజిక హక్కులు

    మాతృత్వం గురించి చెబుతూ దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది.” ఇబ్న్ మాజా 2771. ఈ విధంగా సామాజిక వృద్ధి, సాఫల్యానికి కారకులు స్త్రీలవుతారు. మానవుని ఎదుగుదలకు మొదటి మెట్టు అతని తల్లి అవుతుంది. ఎందుకంటే తల్లి చూపించే వాత్సల్యం, భద్రత, ఇచ్చే శిక్షణ వల్లే మానవుడు, మంచి పౌరునిగా ఎదుగుతాడు. అందువల్లే ప్రతి స్త్రీ విద్యావంతురాలై ఉంటే ఇటు మానవులకు, అటు సమాజానికి ఎంతో మేలు చేకూరుతుంది.

    ఆర్థిక హక్కులు

    ముస్లిం స్త్రీకి ధనం సంపాదించే, ఆస్తి కూడగట్టే, చట్టపరంగా తన ఆస్తుల్ని తన ఇష్టానుసారం కాపాడుకునే హక్కు ఉంది. ముస్లిం స్త్రీకి వ్యాపారం కూడా చేసుకునే హక్కు ఉంది. ఆమె ఆస్తులపై ఎవరికీ, తన భర్తకు కూడా  ఎలాంటి హక్కు లేదు. ఈ విషయం గురించి ఖుర్ఆన్ ఇలా అంటుంది: “అల్లాహ్‌ మీలో కొందరికి మరికొందరిపై  దేని  మూలంగా విశిష్ఠతను ప్రసాదించాడో  దానికోసం ఆశపడకండి. పురుషులు  సంపాదించిన  దానినిబట్టి  వారి  భాగం వారికుంటుంది.  అలాగే స్త్రీలు  సంపాదించిన  దానినిబట్టి వారి భాగం వారికుంటుంది.   కాకపోతే మీరు అల్లాహ్‌ నుండి ఆయన అనుగ్రహాన్ని అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతిదీ తెలిసినవాడు.” ఖుర్ఆన్ సూరా నిసా 4:32
    ముస్లిం స్త్రీకి బంధువుల వారసత్వపు హక్కు ఉంటుంది. ఖుర్ఆన్ లో ఇలా ఉంది: “తల్లిదండ్రులు,  సమీప  బంధువులు  వదలివెళ్ళిన ఆస్తిలో పురుషులకు భాగం ఉంది.  అలాగే   తల్లిదండ్రులు,   సమీప బంధువులు వదలివెళ్ళిన ఆస్తిలో స్త్రీలకు కూడా భాగం ఉంది. ఆ ఆస్తి తక్కువైనాసరే, ఎక్కువైనాసరే (అందులో) వాటా మాత్రం నిర్ధారితమై ఉంది.” ఖుర్ఆన్ సూరా నిసా 4:7

     భార్య హక్కులు

    ఖుర్ఆన్ లో ఇలా సెలవియ్యబడింది: “మరి ఆయన సూచనలలోనే ఒకటేమంటే;  ఆయన మీ కోసం స్వయంగా మీలో నుంచే భార్యలను సృజించాడు- మీరు   వారి  వద్ద   ప్రశాంతత  పొందటానికి!ఆయన  మీ  మధ్య  ప్రేమనూ,    దయాభావాన్నీ  పొందుపరచాడు.  నిశ్చయంగా  ఆలోచించే వారి కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి.” ఖుర్ఆన్ సూరా రూమ్ 30:21. ఇస్లాంలో పెళ్లి కేవలం శారీరికమైన కోరిక తీర్చే సాధనం మాత్రమే కాదు. ఇది అల్లాహ్ తరఫున ఓ సూచన మరియు సంకేతం. ఈ బంధుత్వంలో అల్లాహ్ ఆదేశానుసారం పరస్పర హక్కులు, బాధ్యతలు ఇమిడి ఉన్నాయి. అల్లాహ్ స్త్రీ, పురుషులను ఇచ్చి పుచ్చుకునే ప్రకృతి ధర్మంపై పుట్టించాడు. ఖుర్ఆన్ లో తెలియజేయబడిన చట్టాలను అనుసరించిన మీదట వీరి మధ్య సామరస్యపూర్వకమైన సంబంధం స్థాపితమవుతుంది.
    పురుషులను అల్లాహ్ స్త్రీల సంరక్షకులుగా చేశాడు. పురుషులు కుటుంబ బాధ్యతలను కూడా నెరవేర్చాలి. జీవితాన్ని అల్లాహ్ ఆదేశానుసారం గడపండని తన కుటుంబాన్ని ఆదేశించడం కూడా అతని బాధ్యతల్లో ఒక ముఖ్యమైన బాధ్యత. కుటుంబ సభ్యుల పట్ల దయాగుణం కలిగి ఉండడంభార్య బాధ్యతల్లో ఓ ముఖ్యమైన బాధ్యత.  దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా ప్రవచించారు: “తమ ప్రవర్తనలో మంచివారే ఉత్తమ విశ్వాసులు. మీ భార్యలతో మంచిగా ఉండేవారే మీలో ఉత్తములు.”

     భార్య బాధ్యతలు

    హక్కులతోపాటు బాధ్యతలు కూడా వస్తాయి. కావున వారి భర్తల బాధ్యతలు వారిపై కొన్ని ఉన్నాయి. ఖుర్ఆన్ లో వివరించబడింది: “తమ  భర్తలు లేని  సమయంలో  అల్లాహ్‌   రక్షణలో  ఉంటూ  (తమ  శీలాన్నీ, భర్త సంపదను) కాపాడుతారు.” ఖుర్ఆన్ సూరా నిసా 4:34. భార్య తన భర్త రహస్యాలను కాపాడాలి. ఎట్టి పరిస్థితిలోనూ భార్య తన భర్త పరువు, గౌరవాలు కాపాడుతూ ఉండాలి. భార్య తన భర్త సంపదను కూడా కాపాడాలి. ఆమె తన ఇంటిని, ఆస్తులను – దొంగతనానికి, నష్టానికి – గురికాకుండా రక్షించాలి. ఇంటి ఖర్చుల్లో  దుబారా ఖర్చు కాకుండా చూడాలి. తన భర్త ఇష్టపడని వ్యక్తిని ఇంటిలోనికి రానివ్వకూడదు. భర్త వేటిపైనైతే ఖర్చు చేయకూడదు అంటాడో వాటిపై ఎలాంటి ఖర్చు చేయకూడదు. భర్తతో అన్ని విషయాలలో పరస్పరం సహకరించుకోవాలి. అల్లాహ్ కు  క్రుతఘ్నుడితో సహకారం కుదరదు. అల్లాహ్ ఆజ్ఞకు విరుద్ధంగా ఏదైనా చేయమంటే ఆమె అతని మాటను త్రోసివేయాలి. భర్త కూడా భార్యను చులకనగా చూడకూడదు. అంతేకాదు, ఆమె అవసరాలను, సంతోషాలను దృష్టిలో ఉంచుకోవాలి.

     ముగింపు/ నిర్ధారణ

    అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా అన్నాడు:“(చూడండి) అల్లాహ్‌ మరియు ఆయన ప్రవక్త ఏ   వ్యవహారం లోనయినా  ఒక   నిర్ణయం  చేసిన  తరువాత  విశ్వాసులైన ఏ పురుషునికిగానీ,  స్త్రీకి గానీ  తమకు వర్తించే ఆ వ్యవహారంలో ఎలాంటి స్వయం నిర్ణయాధికారం మిగిలి ఉండదు. ఒకవేళ ఎవరైనా అల్లాహ్‌కు, ఆయన ప్రవక్తకు  అవిధేయత  చూపితే  అతను స్పష్టమైన అపమార్గానికి  లోనైనట్లే (జాగ్రత్త!).” ఖుర్ఆన్ సూరా అహ్జాబ్ 33:36
    ముస్లిం స్త్రీలకు1400సంవత్సరాల క్రితం ఏ పాత్రలు, బాధ్యతలు, హక్కులు ఇవ్వబడ్డాయో అవి నేటి స్త్రీలకు – పాశ్చాత్య దేశాల్లో – కూడా లేవు. సమాజంలో సమతూకం కోసం ఇవి అల్లాహ్ తరఫున అవతరింపజేయబడ్డాయి. ఒక్కోచోట ఏదైనా తప్పినట్టు కనిపిస్తే అది వేరేచోట పూర్తి గావించబడుతుంది. ఇస్లాం ముస్లింలకే కాదు పూర్తి మానవాళికి ఆచరించదగ్గ జీవనసరళి.

    స్త్రీలు ఇస్లాంవైపుకు ఎందుకు మరలుతున్నారు

    ప్రస్తుతం మీడియా ఇస్లాం పై అసత్య ప్రచారం చేస్తున్నప్పటికీ, లేని పోని అభాండాలు వేస్తున్నప్పటికీ, ఇస్లాం స్త్రీలను నొక్కిపెడుతుందని చెబుతున్నప్పటికీఅల్లాహ్ కృప వల్లప్రపంచంలో వేగవంతంగా ప్రజలు స్వీకరిస్తున్న ధర్మం ఇస్లాం.ఇందులో విశేషమేమిటంటే ఇస్లాం స్వీకరిస్తున్న వారిలో ఎక్కువ శాతం ‘స్త్రీలే’.

    ఖుర్ఆన్

    ఇస్లాం లో స్త్రీ అయినా, పురుషుడైనా  అల్లాహ్ కు సమానం. వారి కర్మలకు చెందినంతవరకు స్త్రీ అయినా, పురుషుడైనా మంచి పనికి మంచి బహుమానం మరియు చెడ్డ పనికి ఘోరమైన శిక్ష అనుభవిస్తారు. ఖుర్ఆన్ లో ఇలా అనబడింది:భర్తలకు స్త్రీలపై హక్కులున్నట్లే స్త్రీలకు కూడా వారిపై హక్కులున్నాయి – కాని ఉత్తమ రీతిలో! కాకపోతే పురుషులకు స్త్రీలపై  ఒకింత ప్రాధాన్యత ఉంది. అల్లాహ్‌ సర్వాధికుడు, వివేచనాపరుడు.ఖుర్ఆన్ సూరా బఖరా 2:226

     హదీస్

    ఖచ్చితంగా స్త్రీలు పురుషులు సమాన భాగాలు. తిర్మిజి,113;  సహీహ్ హుత్ తిర్మిజిలో అల్బాని గారు దిన్ని ధ్రువీకరించారు.

     ప్రస్తుత సమాజంలో స్త్రీల పరిస్థితి

    సమాజంలో స్త్రీల స్థితి కొత్తదీ కాదు, పూర్తిగా పరిష్కరించబడనూలేదు. ఇస్లాం గురించి చెప్పేటప్పుడు స్త్రీలకు స్వేచ్చ లేదనీ, ఇంటివరకే– వంటవరకే పరిమితమైపోయిందనీ ప్రచారం చేస్తారు.కొందరైతే పరదా మూలంగా స్త్రీల స్వేచ్ఛ, ఎదుగుదల ఆగిపోయిందని గంటల కొద్దీ చెబుతూ పోతారు. వారందరికి ఒకే ప్రశ్న చాలు. అదేమిటంటే – యూరోప్, అమెరికాలాంటి నాగరికత దేశాలలో, అక్కడే పుట్టి పెరిగిన ఆడవారు ఇస్లాం ఎందుకు స్వీకరిస్తున్నారు. అక్కడి స్త్రీలు పాశ్చాత్య దేశాలు ఇస్తున్న స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని విడిచి, స్త్రీల స్వేచ్ఛకు అడ్డువేసే  ఇస్లాం ను ఎందుకు అవలంబిస్తున్నారు?

     పాశ్చాత్య దేశాల ‘స్వాతంత్ర్యాన్ని’ తిరస్కరించుట

    పాశ్చాత్య దేశాల స్వాతంత్ర్యం స్త్రీలను దిగజార్చుతుంది, అదే ఇస్లాం వీరిని ఉన్నత స్థానం ఆపాదిస్తుంది. వారు స్త్రీల కొత్త సమస్యలు లేవనెత్తి పాత సమస్యలను వదిలేస్తున్నారు. మీడియా పురుషులకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. అందుకే అక్కడి స్త్రీలు ఇస్లాం వైపు మొగ్గు చూపుతున్నారు. ఖుర్ఆన్ లో అల్లాహ్ ఇలా అన్నారు:  మీరూ, మీ భార్యలూ సంతోషంగా (సగౌరవంగా) స్వర్గంలో ప్రవేశించండి.ఖుర్ఆన్ సూరా జుఖ్రుఫ్ 43:70

     ముస్లిం స్త్రీలు

    ఇస్లాం సమాజంలో స్త్రీలకూ, పురుషులకూ వారి వారి పూర్తి హక్కుల్ని, బాధ్యతల్నితెలియపరుస్తుంది. ఇస్లాంవారిరువురిలో ఎవరినీ అన్యాయం చేయదు. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు: “సత్కార్యాలు  చేసేవారు -  వారు  పురుషులైనా,స్త్రీలైనా-  విశ్వసించి ఉంటే,  ఇలాంటివారు తప్పకుండా  స్వర్గంలో ప్రవేశి స్తారు. వారికి ఖర్జూరపు విత్తనంపై ఉండే గాటుకు సమానంగా కూడా అన్యాయం జరగదు.” ఖుర్ఆన్, సూరా నిసా4:124

     నిర్ధారణ

    ఏ మనిషైతే స్త్రీని గౌరవించి, ఆమెతో న్యాయంగా మెలుగుతాడోఅతనే నిజమైన మగాడు మరియు మర్యాదస్తుడు, అదే ఎవడైతే ఆడవారిని అవమానపరుస్తాడో అతడు చాల చెడ్డ వ్యక్తి అని ఇస్లాం బోధిస్తుంది.
    “అందరికంటే ఉత్తమమైన వ్యక్తిత్త్వం గలవాడు పూర్తి విశ్వాసి. మీలో మీ ఇంటివారితో ఉత్తమంగా మేలిగేవాడే అందరికంటే ఉత్తముడు” అని దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం అన్నారు.తిర్మిజి1162

    ఇస్లాంలో మహిళలు

    ఇస్లాంలో మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇస్లాం మహిళకు తన ఆస్తి హక్కు ఇచ్చింది. ఆమె అల్లాహ్ ఆదేశించిన  (హలాల్) మార్గాల్లో తన ఆదాయాన్ని ఖర్చు చేసుకోవచ్చు. అలాగే ఆమెకు వారసత్వపు హక్కు కూడా కలదు.

    ప్రాముఖ్యత

    ఇస్లాంలో మహిళలకు అధికగౌరవం ఇవ్వబడింది. ముస్లిం స్త్రీకి అల్లాహ్ పై అపారమైన విశ్వాసం ఉంటుంది, ఈ సృష్టిలో ఏది జరిగినా (మంచి – చెడు) అది అల్లాహ్ ఆజ్ఞ ప్రకారమే జరుగుతుందని విశ్వసిస్తుంది. ఇస్లాం స్త్రీలకు తల్లి, కూతురు, భార్య లాంటి హోదాలు ప్రసాదిస్తుంది.

     ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)సూక్తులు

    దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి కొన్ని ప్రసిద్దిగాంచిన సూక్తులు :”తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది.” ఇబ్న్ మాజా 2771.
    ఒక వ్యక్తి ప్రవక్త(సల్లల్లాహు అలైహి వసల్లం) ను నేను ఎవరికి ఎక్కువగా సేవ చేయాలి అని అడిగాడు. దానికి దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) నీ తల్లి అని మూడు సార్లు అన్న తరువాత, నీ తండ్రి, ఆ తరువాత నీ దగ్గరి బంధువులు అని అన్నారు. సహీహ్ అల్ బుఖారీ వాల్యూం 8:2, సహీహ్ అల్ ముస్లిం 6181
    అబూ హురైరా (రజి అల్లాహు అన్హు) సెలవిచ్చారు : ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) “స్త్రీల విషయంలో అల్లాహ్ కు భయపడండి, భార్యలను బాగా చూసుకొనేవాడే మీలో అందరికంటే మంచివాడు, ఒక ముస్లిం తన భార్యను అసహ్యించుకోకూడదు, ఒక విషయంలో ఆమె తప్పు చేసినా ఆమెలోని మంచి విషయాన్ని చూసి ఆమె తప్పులను మన్నించాలి, భార్యతో చాలా మంచిగా ఉండే భర్తయే ఉత్తమ విశ్వాసి” అని అన్నారు. సహీహ్ అల్ ముస్లిం 3469, తిర్మిజీ 278.

     స్త్రీ హోదా

    ఇస్లాంలో స్త్రీ స్థానం చాలా ఉన్నతమైనది. స్త్రీ ప్రభావం ప్రతి ముస్లిం జీవితంలో చాలా గొప్పది. నవ సమాజ నిర్మాణానికి స్త్రీ నాంది పలుకుతుంది. ఇది సాధ్యమవ్వాలంటే స్త్రీ దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదేశాలను అనుసరించాలి.
    ఖుర్ఆన్ మరియు హదీసు నుండి దూరం ప్రతి ముస్లిం (పురుషుడు లేదా స్త్రీ) ను తప్పుదోవ పట్టిస్తుంది. కేవలం అల్లాహ్  చూపిన మార్గాన్ని, ప్రవక్తలు నడిచిన దారిని వదలడం వల్లనే నేడు అన్ని దేశాలు రకరకాల సమస్యలతో సతమతమవుతున్నాయి. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)సెలవిచ్చారు : “నేను రెండిటిని వదిలి వెళుతున్నాను, వాటిని వదలనంత వరకు మీరు మార్గభ్రష్టులు కాలేరు. అవి ఏమిటంటే దైవగ్రంథమైన ఖుర్ఆన్ మరియు నా ఉపదేశాలు (సున్నత్).” మాలిక్ ఇన్ అల్-మువత్తా 2:899, అల్-హాకిమ్1:93, దీన్ని అల్-అల్బానీ అస్-సహీహ1871లో ధ్రువీకరించారు.
    దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన సున్నత్ (హదీసు) లలో స్త్రీ భార్యగా, సోదరిగా, కూతురుగా నిర్వహించాల్సిన బాధ్యతలను వివరించారు.
    స్త్రీ ప్రాముఖ్యత ఆమెపై మోయబడిన బాధ్యతల ద్వారా వ్యక్తమౌతుంది. ఆ బాధ్యతలను ఒక పురుషుడు కూడా మోయలేడు. అందువల్లే ప్రతి వ్యక్తి తన తల్లికి ప్రేమ, ఆప్యాయత, అనురాగం చూపాలని అల్లాహ్  ఆదేశించాడు. ఈ కారణంగా తండ్రిపై తల్లికి ప్రాధాన్యత ఇవ్వాలని ఉంది.
    అల్లాహ్  సెలవిస్తున్నాడు :“ మరియు అల్లాహ్  ఇలా ఆదేశిస్తున్నాడు: ‘మేము మానవునకు తన తల్లిదండ్రుల యెడల మంచితనంతో మెలగటం విధిగా చేశాము. అతని తల్లి అతనిని బలహీనతపై బలహీనతను సహిస్తూ (తన గర్భంలో) భరిస్తుంది. మరియు ఆ బిడ్డ చనుపాలు మాన్పించే గడువు రెండు సంవత్సరాలు. నీవు నాకు మరియు నీ తల్లిదండ్రులకు కృతజ్ఞూడవై ఉండు. నా వైపునకే నీవు మరలి రావలసి ఉన్నది.”  సూరా లుఖ్మాన్ : 31:14
    “మరియు మేము మానవునికి తన తల్లిదండ్రుల పట్ల మంచితనంతో మెలగాలని ఆదేశించము. అతని తల్లి అతనిని ఎంతో బాధతో తన గర్భంలో భరించింది మరియు ఎంతో బాధతో అతనిని కన్నది. మరియు అతనిని గర్భంలో భరించి అతనిని పాలు విడిపించే వరకు ముప్ఫై నెలలు అవుతాయి.” సూరా అల్ అహ్ ఖాఫ్ : 46:15

    Monday, 13 January 2014

    సమయం – సందర్భం


    ప్రతి భాషలోనూ మాట్లాడే తీరు, ప్రసంగించేె విధానం ప్రత్యేకంగా ఉంటుంది. ఆ భాషలో మాట్లాడదలచిన వారు వాటిని తెలుసుకోవడం అత్యవసరం. అది ప్రాతీయ చలోక్తులు, సామెతలు, శతకాలు, సుభాషితాలు, పద్యాలు, గద్యాలు, కావ్యాలు ఏవైనా కావచ్చు. వీటి మాధ్యమంతో శ్రోతల హృదయాలను హత్తుకునేలా మాటను చెప్ప గలుగుతాము. అలాగే శ్రోతలను బట్టి భాష, విషయం ఉండాలి. ‘చెప్పేవాడికి వినేవాడు లోకువ’ అన్నట్టు సామాన్యులతో తాత్విక భాషణలు, చర్చలు లేవనెత్తడం, బరువయిన పదాలను, సమాసాలను వాడటం ఎంత మాత్రం వివేకం అన్పించుకోదు. పైగా ఈ వైఖరి వల్ల మనం అందించాలనుకున్న సందేశం వైఫల్యం చెందుతుంది. మహా ప్రవక్త ముహమ్మద్‌ (స) గురించి ఆయన సతీమణి విశ్వాసుల మాత హజ్రత్‌ ఆయిషా (ర) ఇలా అభిప్రాయపడ్డారు: ”ఆయన (స) మాట ఎంతో విపులంగా, సరళంగా స్పష్టంగా ఉంటుంది. విన్న ప్రతివాడు ఇట్టే అర్థం చెసుకునేవాడు”. (అబూ దావూద్‌)
    ఇకపోతే, మనిషి మానసికంగా మాటను విని జీర్ణించుకోగల స్థితిలో ఉన్నప్పుడే ఏదైనా విషయాన్ని అతనికి బోధించాలి. అలా కాక మనసు పరధ్యానానికి లోనై ఉన్నప్పుడు బలవంతంగా ఏదయినా వినిపిస్తే మొండిగా ఆ బోధను తిరస్కరించే ప్రమాదముంది. వివేకం కోల్పోయి మూర్ఖంగా ప్రవర్తించే అవకాశమూ లేకపోలేదు. హజ్రత్‌ అలీ (ర) ఇలా ఉపదేశించారు: ”మనసులకు (హృదయాలకు) కొన్ని తత్వాలుంటాయి. కొన్ని ప్రీతికర విషయాలుంటాయి. కొన్ని సందర్భాల్లో ఆంత ర్యాలు మాటను స్వీకరించటానికి అనుకూలంగా ఉంటాయి. మరి కొన్ని సందర్భాల్లో వాటిలో వెన్ను చూపే స్వభావం ప్రబలి ఉంటుంది. కనుక ప్రజల ఆంతర్యాల తత్వాన్ని బట్టి, అవి హితవును అంగీకరిం చేందుకు అనుకూలంగా ఉన్నప్పుడు వాటిలో ప్రవేశించండి. ఎందు కంటే, మనసును బలాత్కరించినప్పుడు అది గుడ్డిదయిపోతుంది”. (కితాబుల్‌ ఖిరాజ్‌ – అబూ యూసుఫ్‌)
    మరో సదర్భంలో హజ్రత్‌ అలీ (ర) ఇలా అభిప్రాపడ్డారు: ”ఎవరైతే ప్రజల్ని అల్లాహ్‌ కారుణ్యం పట్ల నిరాశకు గురి చెయ్యడో, వారు దైవాజ్ఞల్ని ఉల్లంఘించడానికి అనుమతించడో, వారిని అల్లాహ్‌ శిక్ష  పట్ల భయపడనట్లు చెయ్యడో – అలాంటి ధర్మ జ్ఞానియే నిజమైన స్థిత ప్రజ్ఞుడు”. (కితాబుల్‌ ఖిరాజ్‌)
    అంటే – ప్రజలు తమ మోక్షం పట్ల, అల్లాహ్‌ా కారుణ్యం పట్ల నిరాశ చెందేలా నకారాత్మక బోధనలు చేయడం (బాధ గురువులుగా వ్యవ హరించడం) ఎంత తప్పో, ఆల్లాహ్‌ా క్షమా గుణాన్ని, కృపాకటాక్షాల్ని, ప్రవక్త (స) వారి సిఫారసును తప్పుగా చిత్రీకరించి ప్రజలు దైవాజ్ఞ ఉల్లంఘనకు పాల్పడేలా చేయడం, వారిని మొరటు వ్యక్తులుగా తయారు చేసే ఊక దంపుడు ఉపన్యాసాలివ్వడం కూడా అంతే ఘోర మైన నేరం. సరయిన పంథా ఏమంటే, ఉభయ కోణాలూ ముందుం డాలి. అటు నిరాశా జనించకూడదు. ఇటు నిర్భయము, దుస్సాహ సమూ కలగకూడదు.
    దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) ప్రజల్ని తీర్చిదిద్దే నిమిత్తం సరైన సమయం సందర్బం కోసం ఎదురు చూస్తుండేవారు. అలా ప్రాప్త మయిన మంచి అవకశాన్ని ఆయన సద్వినియోగ పరచుకునేవారు.
    ఓ సారి దైవ ప్రవక్త (స) వారి సమక్షంలోకి కొంత మంది ఖైదీలు తేెబడ్డారు. ఆ ఖైదీలలో ఓ మహిళ కూడా ఉంది. ఆమె స్తనాల్లో పాలు నిండుగా ఉన్నాయి. ఆ ఖైదీలలో ఒక పసి బాలుడు ఏడ్వడం చూసి ఆమెలోని మమత ఉప్పొంగింది. వెళ్ళి అ పసికందుని అమాంతంగా తన గుండెలకు హత్తుకుని పాలు పట్ట సాగింది. ఈ అద్భుత ధృశ్యాన్ని మహా ప్రవక్త (స) మరియు ఆయన సహచరులు తిలకిస్తున్నారు. (తన సహచరుల్ని ఆ తల్లి ప్రేమ ఆశ్చర్యచకితుల్ని చేెసిందన్న విషయాన్ని గ్రహించిన ప్రవక్త (స) సత్యోపదేశం కోసం ఇది సువర్ణ సమయ మని భావించి) ”ఈ మాతృమూర్తి గురించి మీ అభిప్రాయమేమిటి? ఈమే తన సొంత కుమారుణ్ణి స్వహస్తాలతో అగ్నికి ఆహుతి చెయ్య గలదా?” అని వారిని ప్రశ్నించారు. ‘అల్లాహ్‌ా సాక్షి! ఈ తల్లి తన చేజే తులా తన పిల్లవాణ్ణి నిప్పుల్లో పడవేయజాలదు’ అని సహాబా ముక్త కంఠంతో బదులిచ్చారు. అప్పుడు దైవ ప్రవక్త (స) ఇలా హితోపదేశం చేశారు: ”ఈ మాతృమూర్తికి తన పిల్లవానిపై ఎంత ప్రేమ ఉందో అంతకంటే (మరో ఉల్లేఖనం ప్రకారం 70 తల్లులకంటే) ఎక్కువ ప్రేమ అల్లాహ్‌ాకు తన దాసులపై ఉంటుంది”. (బుఖారీ ముస్లిం)
    ఓ సారి దైవ ప్రవక్త (స) బజారు గుండా వెళుతున్నారు. ఆయన ఇరుప్రక్కల జనం ఉన్నారు. దారి ప్రక్కన చచ్చి పడి ఉన్న పొట్టి చెవులు గల ఓ మేక పిల్లను చూశారు. (క్రింద కూర్చోని) దాని చెవి పట్టుకొని: ”మీలో ఎవరైనా దీన్ని ఒక్క దిర్హముకైనా కొనడానికి ఇష్టపడతారా?” అని ప్రశ్నించారాయన.
    అందుకు – ‘దిర్హముకన్నా తక్కువ ఖరీదుకు కూడా మేము దాన్ని తీసుకోము. ఒకేళ తీసుకున్నా దాన్ని మేమేం చేసుకుంటాము?’ అని బదులిచ్చారు ప్రజలు. అది విన్న దైవ ప్రవక్త: ”ఒకవేళ ఉచితంగా లభిస్తే తీసుకోవడానికి ఇష్టపడతారా?” అని మళ్ళీ అడిగారు. దానికి వారు – ‘అల్లాహ్‌ా సాక్షి! ఒకవేళ అది బ్రతికున్నా (మేము దాన్ని తీసు కోవడానికి ఇష్టపడేవారము కాము) దీనిలో లోపం ఉంది. దీని చెవులు పొట్టిగా ఉన్నాయి. ఇక చచ్చిపోయిన తర్వాత ఎలా తీసుకుం టాం?’ అని అన్నారు. అప్పుడు దైవ ప్రవక్త (స) ”వల్లాహి! ఈ మేక పిల్ల మీ దృష్టిలో ఎంత హేయమైనదో అల్లాహ్‌ా దృష్టిలో ఈ లోకం అంతకన్నా హేయమైనది” అని హితవు పలికారు. (ముస్లిం)
    చచ్చి కంపు కొట్టే పశువు దగ్గర నిలబడటం ఎవరికి ఇష్టం ఉండదు. ఒకవేళ ఆ మార్గం గుండా వెళ్ళాల్సి వస్తే ముక్కు పుటాలు మూసుకుని మరీ తొందరగా ఆ ప్రదేశాన్ని దాటి వెళ్ళేందుకు ప్రయత్నిస్తారు ప్రజలు. ఆ చచ్చిన మేక పిల్ల పట్ల అక్కడున్న ప్రజల్లో గల ఏహ్య భావాన్ని గమనించిన ప్రవక్త (స) ఏం చేశారంటే – ముందు ఆ మేక పిల్ల వద్దకు వెళ్ళారు. తర్వాత దాని చెవులు పట్టు కున్నారు. ప్రజలంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆ సందర్భాన్ని హితవు గరిపేందుకు మంచి అవకాశంగా భావించి, వారికి ఐహిక వాస్తవికతను తెలియ పర్చడమే కాక, వారిలోని ప్రాపంచిక వ్యామో హాన్ని అంతమొందించి, పరలోకం కోసం పాటుపడేలా వారిని ప్రేరే పించారు. సుబ్హానల్లాహ్‌!
    ఓ సారి ఒక వ్యక్తి దైవ ప్రవక్త (స) వారి పవిత్ర సన్నిధికి వచ్చి – ”యా రసూలల్లాహ్‌ా! ప్రళయం ఎప్పుడొస్తుందంటారు?” అని ప్రశ్నించాడు.
    చూడబోతే ఈ ప్రశ్న చాలా సామాన్యమైన ప్రశ్నగానే గోచరిస్తుంది. ఆ వ్యక్తి అడిగిన తీరు కూడా సాధారణమైనదే. ప్రవక్త (స) అతనికి బదులిచ్చి సాగనంపాల్సింది. కొన్ని ప్రళయ సూచనలు తెలియజేసి అతని నోరు మూయించాల్సింది. లేదా ఆ దినం గూర్చిగానీ, ఆ ఘడియ గూర్చి గాని నాకు తెలియదు అని, అల్లాహ్‌ాకు మాత్రమే తెలుసునని దాట వేయాల్సింది. కాని ఆయన (స) అలా చేయలేదు. ఆయన అతని అంతర్మధనాన్ని అంచనా వేశారు. పరలోక భీతితో అతని మనో స్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ కారణంగానే తను ఈ ప్రశ్న అడిగాడు. ఇది శిక్షణకు సరైన సమయం అని భావించి ప్రవక్త (స) – జవాబివ్వడానికి బదులు అతనికే ఎదురు ప్రశ్న వేశారు: ”ఆ ఘడియ కోసం నువ్వు ఏ విధమైనటువంటి సామగ్రిని కూడబెట్టు కున్నావు?” అని.
    ఈ చిన్న ప్రశ్నతో దైవ ప్రవక్త (స) అతని ఆలోచనా స్రవంతిని సకా రాత్మక దిశన పయనించేలా చేశారు. ప్రళయం ఎప్పుడు వస్తుందన్నది కాదు సమస్య. ప్రళయం కోసం మనం ఏం సమకూర్చుకున్నామన్నది అసలు సమస్య. ఒకవేళ ప్రళయం ఆలస్యంగా వచ్చినా మన వద్ద ఏ విధమైనటువంటి ముందస్తు సామగ్రి లేకపోతే ప్రయోజనం పూజ్యం. అదే మనం అన్ని విధాల సమాయత్తమయి ఉంటే ప్రళయం ఈ క్షణం వచ్చినా భయం లేదు అని స్వయంగా ఆ వ్యక్తి గ్రహించేలా, ఆత్మావ లోకనం చేసుకునేలా చేశారు. అది విన్న ఆ వ్యక్తి తన యావత్తు జీవితాన్ని సునిశితంగా పరిశీలించి ఇలా అన్నాడు: ”అల్లాహ్‌ పట్ల మరియు ఆయన ప్రవక్త (స) పట్ల ప్రేమ”.
    అంటే, నేను కూడబెట్టుకున్న పరలోక సామగ్రల్లా దైవ ప్రేమ, మరియు దైవ ప్రవక్త (స) వారి ప్రేమ అంతే. జీవిత అన్ని రంగాల్లో అల్లాహ్‌ా మరియు ఆయన ప్రవక్త (స)ను ప్రసన్నుల్ని చేయడమే నా ల క్ష్యం. నా జీవిత ధ్యేయం దైవ దాస్యం. నా జీవితం అల్లాహ్‌ా మరియు ఆయన ప్రవక్తకే అంకితం అన్నాడు. అతని నోట ఈ మాట విన్న విశ్వ నాయకులు (స) సంతోషంతో పరవశించిపోతూ అతనికి శుభవార్తను అందజేశారు:
    ”నువ్వు ప్రేమించే, అభిమానించే వారి సరసనే రేపు ప్రళయ దినాన నువ్వుంటావు” అన్నారు. సుబ్బానాల్లహ్‌! (బుఖారీ, ముస్లిం)

    Sunday, 29 December 2013

    కర్తవ్యం పిలుస్తోంది… కదలి రండి!

    కూపస్థ మండూకాల్లా పడివున్న ఇస్రాయీల్‌ సంతతి ప్రజలు ప్రవక్త మూసా (అ) పిలుపుతో భావ దారిద్య్రం నుండి తేరుకొని స్వేచ్ఛా ప్రపంచంలోకి ప్రవేశించారు. అప్పటికే వారిపై ఎన్నో ఆంక్షలు ఉండేవి. 70 వేల పసికందుల్ని కోల్పోవాల్సి వచ్చిన నికృష్ట సందర్భం కూడా అదే. అయినా వారు అధైర్య పడలేదు. కరుణ ఆభరణాల్లో సంకల్పాల వజ్రాలు పొదిగి, కూర్మి కవచాలు తొడిగి సమర క్షేత్రంలో సమరస స్ఫూర్తితో దూసుకుపోయారు. స్రీలు సయితం సమాజంలోని సగ భాగం గనుక కర్తవ్య పరాయణత పారీణతతో ప్రతి ఒక్క పడతిలో చైతన్యం పెల్లుబికింది. జాతి విముక్తి కోసం పోరాటపటిమను కొన సాగించమని కొండంత ధైర్యాన్నిచ్చి సాగ నంపారు అలనాటి వీర నారీమణులు.

    మానవ పురోగమన పోరాటం అనేక రూపాల ఆధారంగా జరిగింది. అజ్ఞానం నుండి, భయం నుండి, దోపిడి నుండి, పెత్తనం నుండి, నియంతృత్వ భావన నుండి, బానిసత్వం నుండి, అణచివేత నుండి విముక్తి నొందడానికి కృషి చేస్తూనే ఉన్నాడు మనిషి. ఈ కార్య సాధన కోసం అసాధారణ త్యాగాలు చేస్తూ వచ్చాడు మనిషి. విశ్వంలోని జనవాహిని సమానంగా గౌరవించబడాలని, ఆదరించబడాలని అభిలషించారు మానవోత్తములు కొందరు. ఆ విధంగా లోకవాసులంతా సమరస భావంతో విరాజిల్లాలని, వారిలో సోదర భావం వెల్లి విరియాలని ఆకాంక్షించారు ఆ పురుషోత్తములు.
    ఈ ఆశయ సిద్ధి కొరకు పురుషులతోపాటు అపూర్వ త్యాగాలు చేసిన ఆడపడుచులు సయితం అధిక సంఖ్యలోనే ఉన్నారు. వారిలో కొందరు ఆర్థిక, ఆధ్యాత్మిక, నైతిక పరమైన త్యాగాలకు పేరెన్నికగంటే మరి కొందరు కార్య దీక్షకు, పశ్రాంత చిత్తానికి పత్రీకలయ్యారు. కొందరు అసమాన నాయకత్వ లక్షణాలలో పస్రిద్ధి పొందగా, ఇంకా కొందరు కమ్రశిక్షణకు, ధైర్యసాహసాలకు మచ్చుతునకలయ్యారు.
    ఈజిప్టులో ప్రవక్త మూసా (అ) ఫిరౌన్‌ నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపు ఇచ్చినప్పుడు గాని, పాలస్తీనాలో ప్రవక్త ఈసా (అ) అంధానుసరణకు వ్యతిరేకంగా గళం విప్పినప్పుడు గాని, అరేబియాలో అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) విశ్వ మానవ సోదరభావంతో కూడిన సత్య శంఖాన్ని పూరించినప్పుడుగాని పురుషులతోపాటు స్త్రీలు సయితం సహజంగానే స్పందించారు. తమవంతు సహాయం అందించారు. నిరుపమాన త్యాగాలూ చేశారు. పురుషుల్లాగే స్త్రీలూ అమరగతి నొందారు. సంఘ బహిష్క రణకు, ఏలికల వైషమ్యానికి బలయ్యారు. ఇలా తమ ధన, మాన, ప్రాణ త్యాగాలతో లోకశాంతి సిద్ధిస్తుందని పురుషులు మాదిరి వారూ కలలు కన్నారు. ఆ కలల్ని నిజం చేసే దిశలో పయనించి పరమోన్నత ప్రభువు సన్నిధికి పయన మయిన పడతులెందరో! లోకశాంతికి సంబంధించిన గురుతర బాధ్యతలను స్వీకరించడానికి వారు ఏనాడూ వెనుకాడి ఎరుగరు. సమరస భావం సమానత్వం, నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం, కరుణ, దయ, జాలి, ఆప్యాయత, అనురాగం, ప్రేమ, వాత్సల్యం – తౌహీద్‌ ప్రాతిపదికలపై ఆధునిక సత్సమాజాన్ని నిర్మించాలనే తపనలో అలనాటి సుమతులు, సదయులు అహరహం శ్రమించారు. విశ్వ మానవ కళ్యాణం నిమిత్తం అంటే- వర్గ, వర్ణ, ప్రాంత, భాష, జాతి తర తమ భేదరహిత సమరస సమాజాన్ని వారు ఆకాంక్షించారు. ఈ మహోన్నత లక్ష్య పునాదులు నూహ్‌ా ప్రవక్త నాటి నుండే పాదులు వేసుకున్నాయన్నది గమనార్హం.
    కూపస్థ మండూకాల్లా పడివున్న ఇస్రాయీల్‌ సంతతి ప్రజలు ప్రవక్త మూసా (అ) పిలుపుతో భావ దారిద్య్రం నుండి తేరుకొని స్వేచ్ఛా ప్రపంచంలోకి ప్రవేశించారు. అప్పటికే వారిపై ఎన్నో ఆంక్షలు ఉండేవి. 70 వేల పసికందుల్ని కోల్పోవాల్సి వచ్చిన నికృష్ట సందర్భం కూడా అదే. అయినా వారు అధైర్య పడలేదు. కరుణ ఆభరణాల్లో సంకల్పాల వజ్రాలు పొదిగి, కూర్మి కవచాలు తొడిగి సమర క్షేత్రంలో సమరస స్ఫూర్తితో దూసుకుపోయారు. స్రీలు సయితం సమాజంలోని సగ భాగం గనుక కర్తవ్య పరాయణత పారీణతతో ప్రతి ఒక్క పడతిలో చైతన్యం పెల్లుబికింది. జాతి విముక్తి కోసం పోరాటపటిమను కొన సాగించమని కొండంత ధైర్యాన్నిచ్చి సాగ నంపారు అలనాటి వీర నారీమణులు.
    అప్పట్లో త్యాగాలు చేసిన మహిళా లోకంలో ఆసియా బిన్తె ముజాహిమ్‌కు గొప్ప ఖ్యాతియే లభించింది. అప్పటి నిరంకుశ చక్రవర్తి ఫిరౌన్‌కు స్వయాన భార్యగా, ఈజిప్టు దేశానికే మహారాణిగా సకల భోగభాగ్యాలు అనుభవించే వీలు ఉన్నప్పటికీ ఆమె వాటిని ఖాతరు చేయలేదు. తన చేతుల మీదుగా, తన ఒడిలోనే పెరిగి పెద్దయిన మూసా ప్రవక్త సత్య పిలుపుని విని ఉత్తేజితురాలై తన సువర్ణ సౌధాన్ని, అందలి పసిడి ఆభర ణాల్ని, వజ్ర వైఢూర్యాలు నిండిన జీవితాన్ని సన్యసించి సత్య పక్షం వహిం చింది. సత్య ధర్మ పరివ్యాప్తికి స్వయంగా ఫిరౌన్‌ రాజ భవనంలోనే పాదులు వేసి, అసత్య నిర్మూలనకై అవిరళ కృషి సలిపి త్యాగ ధనురాలయింది. పర్యవసానం చాలా భయంకరంగానే పరిణమించింది. సత్యాన్ని విడనాడమని షైతాన్‌ స్వభావుడు ఫిరౌన్‌ ఎంత ఒత్తిడి చేసినా, చివరికి సజీవంగానే శిలువపై వ్రేలాడదీసి అవయవాల్ని ఒక్కొక్కటిగా కోసినా, గుండెల్లో గునపాలు గుచ్చినా , తలలో మేకులు కొట్టినా తొణకక, పట్టు సడలని విశ్వాసంతో ధర్మోన్నతి కోసం ‘రబ్బిజ్‌అల్లీ ఇన్‌దక బైతన్‌ ఫిల్‌ జన్నహ్‌’ (ప్రభూ! స్వర్గంలో నా కోసం నీ తరఫున ఒక నిలయాన్ని నిర్మించు) అంటూ తుది శ్వాస విడిచింది. ఆ విధంగా అలనాటి అనువంశిక దౌర్జన్యంపై తన చెర్నాంకోలును ఝుళిపించింది. అలా అనితర సాధ్య ధైర్యసాహసాల్ని, మొక్క వోని సహనాన్ని పదర్శించిన ఆ మహిళా మూర్తిని సత్య దేవుడైన అల్లాహ్‌ ప్రశంసిస్తూ మానవ జాతి మనుగడకు మణి కుసుమంగా పేర్కొన్నాడు:
    ”మరి అల్లాహ్‌ా విశ్వాసుల కొరకు ఫిరౌను భార్యను ఆదర్శంగా పేర్కొంటు న్నాడు. అప్పుడామె ఇలా వేడుకున్నది: ‘నా ప్రభూ! నా కోసం నీ దగ్గర – స్వర్గంలో – ఒక గృహాన్ని నిర్మించు. నన్ను ఫిరౌను నుండి, అతని దాష్టికా న్నుండి రక్షించు. దుర్మార్గ జనుల నుండి నాకు విముక్తిని ప్రసాదించు”. (తహ్రీమ్: 11)
    అదే రాజ మహలులోని పని మనిషి కూడా తక్కువేమీ కాదు. ఫిరౌన్‌ రాజ భవనంలో స్వయాన అతని ముద్దుల కూతురికి సేవకురాలిగా పని చేసే విశ్వాస మహిళ ఆమె. స్వేచ్ఛా పిపాసతో రగిలిపోయిన, సత్య జ్యోతి ప్రభావంతో వెలిగిపోయిన అబలగా భావించబడే సబల ఆ స్త్రీ మూర్తి. ‘అన రబ్బుకు ముల్‌ ఆలా’ అన్న ఫిరౌన్‌ దురహంకార గర్జనతో స్తబ్ధత ఆవరించిన ఆ సమాజంలో సత్యాగ్ని కణాన్ని రాజేసిన ఆ మాతృమూర్తి విశ్వాసం శక్తివంత మైనది. అసలే బానిసరాలు. ఆపై అబలయి కూడా ఆమె ప్రదర్శించిన సాహసం, సమయస్ఫూర్తి సాటి లేనిది. ఫిరౌన్‌ రాజభవనంలో సత్య శంఖం పూరించింది. ఆమె సత్య ప్రచార శైలికి ముగ్దురాలయి ‘ఆసియా బిన్తె ముజా హిమ్‌’ ఇస్లాం స్వీకరించింది. ఇది తెలుసుకున్న ఫిరౌన్‌ ఆమె నలుగురు బిడ్డల్ని సలసలకాగే నూనెలో పడేసి వేయించేశాడు. ఆ నలుగురిలో ఒకడు పాలు త్రాగే పసికందు కూడా ఉన్నాడు.
    అయినా ఆమె తొణకలేదు సరికదా ”నన్ను సయితం ఈ నూనెకి ఆహుతి చేశాక మా అందరి ఎముకల్ని ఒకే చోట సమాధి చెయ్యండి. రేపు ప్రళయ దినాన ‘లా ఇలాహ ఇల్లల్లాహ్‌ా’ సద్వచనం పలుకుతూ మేమంతా సమాధి నుండి లేస్తాము’ అని ఘంటాపథంగా ప్రకటిం చింది. ఆమె చూపిన ధైర్యసాహసాల్ని మెచ్చుకుంటూ మేరాజ్‌ సందర్భంగా ఏడు ఆకాశాలపైన దైవ దూతల నాయకుడు జిబ్రయీల్‌ ద్వారా ప్రవక్తలందరి నాయకుడైన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్‌ (స) వారికి ఆమె దృష్టాం తాన్ని విన్పించాడు దేవుడు. అట్టి ‘సత్య బాంధవి’ అయిన ఆ వీర వనిత చరిత్రలో చిరస్మరణీయురాలయింది.
    ఆ పరంపరలో పరమ పవిత్రమైన పుణ్యస్త్రీ అయిన జైనబ్‌ (ర)నూ విస్మరిం చలేము. ఆమె మహా నిరాడంబర జీవి. సిగ్గు సిరులే ఆమె ఆభరణాలు. నిస్వార్థ సేవే ఆమె స్వరూపం. సాత్విక ప్రేమానురాగాలే ఆమె నైజం. అనాథ బాలలు, వితంతువులు, నిరుపేదలు అభాగ్యజీవులే ఆమె అనుఁగు సంతానం. ప్రజా సేవే ఆమె ఊపిరి. సంస్కరణా భిలాషే ఆమె మూల ధనం. సత్య ధర్మోన్నతియే ఆమె ప్రాణం. ఆ సత్య వ్యవస్థపై ఆమెకు ఎనలేని అభిమానం. మక్కా మదీనాల్లోని నిరుపేదలతోనే గడిపేది. దీన జనంపై తప్ప మరి దేని పైనా ఆమెకు మమకారం లేదు. వారి క్షేమం కోసమే అహరహం శ్రమించేది. వారి ధ్యాసలోనే ఆమె అసువులు బాసింది. ఇటు ప్రజా సేవ, అటు దైవ సేవలో సమతౌల్యంతో జీవితాన్ని సార్థకం చేసుకుని ‘ఉమ్ముల్‌ మసాకీన్‌’ అన్న ప్రశంస స్వయానా ప్రవక్త (స) నోట పొందిన ధన్యజీవి విశ్వాసుల మాత హజ్రత్‌ జైనబ్‌ (ర).
    ఆ విషయానికొస్తే – సత్యోద్యమంలో, విద్యార్జనలో, ప్రవక్త (స) వారి ప్రవచ నాల్ని ప్రజలకు ప్రబోధించడంలో హజ్రత్‌ ఆయిషా (ర) మహా ధీరోదాత్త. దాదాపు ”2210” హదీసలను ఉల్లేఖించిన ఘనత స్త్రీలలో ఆమె ఒక్కరికే దక్కింది. ప్రవక్త (స) వారి సత్య సూక్తులకు, పరలోక మోక్ష సిద్ధాంతాలకు ప్రభావితురాలయిన ఆమె తర్వాతి కాలంలో ‘జమల్‌ రణ రంగం’లో పాల్గొన్నారు. అప్పట్లో ధార్మిక ఫత్వాలు జారీ చేసిన ధర్మ పండితురాలు. అనేక మంది సహాబాలు ఆమె వద్ద శిష్యరికం పొంది ధార్మిక విద్యార్జన చేసేవారు. ఇలా చెప్పుకుంటూపోతే ఈ పరంపరలో హజ్రత్‌ మర్యమ్‌ (అ), హజ్రత్‌ ఖదీజా (ర), హజ్రత్‌ ఫాతిమా (ర), హజ్రత్‌ అస్మా (ర), హజ్రత్‌ ఉమ్మె సలమా (ర), హజ్రత్‌ ఉమ్మె తలహా (ర) లాంటి వారెందరో ఉన్నారు. వీరంతా ‘ప్రకృతి ధర్మం’ నుండి ప్రేరణ పొందిన నారీమణులే. ఇస్లాం మెచ్చిన వనితలే.
    కాలంతోపాటే విలువలు కూడా మారినాయి. అన్ని రంగాలలోనూ కల కంఠి ముందంజ వేస్తున్నప్పటికీ ఆమె కంట వొలికే కన్నీళ్ళు మాత్రం తగ్గటం లేదు. కారణం ఆధునిక దోపిడీ! నవ నాగరికత పేరిట జరిగే ఎక్స్‌పాయిటే షన్‌!! సబ్బు బిళ్ళ మొదలుకుని షేవింగ్‌ బ్లేడు అమ్మకం వరకు ప్రతి దానికీ మాననీమణి సిగ్గు సిరిని అంగడీలో ప్రదర్శించే మగ మారాజు స్వార్థానికి ‘ఆమె’ అవలీలగా బలైపోతున్నది. తల్లి కడుపులో ప్రాణం పోసుకుంటోందని తెలిసిన క్షణం నుంచే ‘భ్రూణ హత్య’ ఆలోచనతో మొదలయ్యే ఈ ఎక్స్‌పాయిటే షన్‌ ఆమె జీవితంలోని అన్ని థలలోనూ జరుగుతున్నఇద. దానికి బదులు మానవ మనుగడలో ఆమె ‘సగమ’ని, సగాలు రెండూ ఒకటైతేనే గాని జగానికి ఓ నిండుదనం రాదని గ్రహించే సహృద యత పెంపొందాలి. కోమలాంగికి ఆమె కార్య క్షేత్రంలో నిరాటంకంగా పురోగ మించే వ్యవస్థను ఏర్పరచాలి. అదే మహిళాభ్యుదయం. అదే మహిళాభిరామం!!
    మన భారత రాజ్యాంగం ప్రకారం స్త్రీ పురుషులు సమానులని 1950లో చట్టం అమల్లోకి వచ్చినా అది కాస్తా పురుషా హంకార చుట్టమై కూర్చుంది. 1961లో వరకట్న నిషేధం చట్టం వచ్చినా, 1956లో వితంతు వివాహాలకు వీలు కల్పిస్తూ శాసనం పుట్టినా, సుమారు 200 సం నాడు సతి సహగమన వ్యతిరేక చట్టం అమల్లో వచ్చినా ఇంకా స్త్రీలపై అనేక విధాల అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. స్వాతంత్య్రానికి పూర్వం శుల్కం చెల్లించి కన్యల్ని అమ్మే, కొనేవారు, ప్రస్తుతం వరకట్నం ఇచ్చి భర్తల్ని కొంటున్నారు, అమ్ముకొంటున్నారు. ఈ రెండు పద్ధతుల్లోనూ బలి పశువు స్త్రీయే.
    చివరిగా ఒక మాట చెప్పక తప్పదు. ఎవరు సంకెళ్ళలో బంధించబడ్డారో వారే బంధ విముక్తికై స్థిర చిత్తంతో పోరాడాలి. ‘స్త్రీ స్వర్గానికి సోపానం’ అని ప్రవక్త మహాశయుల వారు ప్రకటించి ఆ ఆశయ సిద్ధికై ప్రజల్లో చైతన్య కణాల్ని రాజేసినట్లే స్త్రీలు సయితం తమ శక్తి యుక్తుల్ని వాడి స్వేచ్ఛాసమానత్వాన్ని సాధించుకునే దిశగా పయనించి సమాజాన్ని, దేశాన్ని అభ్యుదయ పథాన నడిపించిన నాడే భవిష్యదర్శనం సుఖ శాంతులకాలవాలమవుతుంది. ఇక్కడ విస్మరించరాని విషయమేమిటంటే స్త్రీల భాగస్వామ్యం లేనిదే సమాజ పురోగాభివృద్ధి అసాధ్యం. పురుష సహకారం లేనిదే అది సాధ్యం అవదు. అంటే- స్త్రీ లేని పురుష ప్రపంచాభివృద్ధి బలహీనపడితే, పురుషుడు లేని స్త్రీ సమాజ అభ్యుదయం కుంటుపడుతుంది. సంసార రథం సాఫీగా సాగదు. సంతానం సత్పౌరులుగా ఎదగరు. ఈ మటుకు విలువలు, బాధ్యతలు మృగ్యమైన ఏ దేశం అభివృద్ధిని పొందలేదు. ఈ పరిణామ ప్రక్రియలో స్త్రీల పాత్ర ఏపాటిదై ఉండాలి? అంటే- 1) స్వయం ఉద్ధరణ. 2) సమాజం యావత్తులో పరివర్తనం తీసుకురావాల్సిన బాధ్యత.
    ఆ మేరకు తల్లులుగా వారు ముందు తమ కుటుంబాల్లోనే సమరస భావానికి పునాదులు వేయాలి. పిల్లల్లో చిన్న నాటనే విశాల భావాన్ని ప్రోది చేయాలి.. స్త్రీ పురుషుల విషయంలో మహా ప్రవక్త (స) చేసిన హితవుల్ని పిల్లలకు బాల్య థ నుండే నూరిపోయాలి. వారిలో తమ చెల్లి, తల్లి, పిన్నీల పట్ల గౌరవాన్ని, అభిమానాన్ని పెంపొందించాలి. సత్య నిరతి, సోదర ఆవం, ప్రేమ, కరుణ, దయ, క్షమ, పరోపకార పారీణత వారిలో నిత్య గుణాలుగా రూపొందాలి. ‘తల్లి ఒడి ప్రాథమిక బడి’ గనుక – తల్లుల ఈ శిక్షణ – సంతాన వ్యక్తిత్వాన్ని సంరక్షిస్తుంది. కుటుంబంలో శాంతిని నింపుతుంది. ఆ దరిమిలా సమాజంలో, దేశంలో శాంతి, అభ్యున్నతి, ప్రగతి, పురోగాభివృద్ధి మూడు పువ్వులు ఆరు కాయల్లా విరాజిల్లుతుంది. స్త్రీలందరూ తమ ఈ కర్తవ్యాన్ని గుర్తించి అహరహం పరిశ్రమించినప్పుడే విశ్వ జనులందరికి సౌభాగ్యం ఇనుమడిస్తుంది. అందు నిమిత్తం కర్తవ్యం మహిళా లోకాన్ని పిలుపునిస్తోంది! స్వాతంత్య్ర దినోత్సవ శుభ సందర్భంగా స్రీలందరూ సహజంగానే స్పందిస్తారని ఆశిస్తూ….